Hoping to find love students of Hindu College will worship Jacqueline Fernandez as 'Damdami Mata' - Goddess of love - this year on Valentine's Day..
ప్రతీ ఏడాది లాగే ఈ ఏడాది కూడా వాలెంటైన్స్ డే సాంప్రదాయాన్ని కొనసాగించబోతున్నారు ఢిల్లీలోని హిందూ కాలేజ్ స్టూడెంట్స్. ఎప్పటిలాగే ఓ బాలీవుడ్ హాట్ బ్యూటీని 'దమ్‌దామి మాత'గా, అలాగే ఓ టాప్ హీరోను 'లవ్ గురు'గా ఎంచుకున్నారు. కాలేజీ ప్రాంగణంలో 'వర్జిన్ ట్రీ'గా పేరుగాంచిన ఒక చెట్టుకు ఈ ఇద్దరి ఫోటోల్ని తగిలించి వాలెంటైన్స్ డే హంగామా చేయనున్నారు.
వాలెంటైన్స్ డే రోజు 'వర్జిన్ ట్రీ'ని ఆరాధించడం కాలేజీ ప్రారంభమైన నాటి నుంచి కొనసాగిస్తున్నామని ఇక్కడి విద్యార్థులు చెబుతున్నారు. ఫిబ్రవరి 14న 'వర్జిన్ ట్రీ' వద్ద పూజలు జరిపే విద్యార్థి, విద్యార్థినులు ఆ తర్వాత ఆర్నెళ్లలోనే ప్రేమలో పడుతారని, ఆపై సంవత్సరంలోగా తమ 'వర్జినిటీ' పోగొట్టుకుంటున్నారని చెబుతున్నారు.
గతేడాది 'వర్జిన్ ట్రీ' వద్ద పూజల కోసం దమ్‌దామి మాతగా దిశా పటానీ పూజలు అందుకోగా.. ఈసారి హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ పూజలు అందుకోబోతుంది. దమ్‌దామి మాత ఎంపిక కోసం కాలేజీలో ఓటింగ్ సైతం పెట్టగా.. నర్గీస్ ఫక్రీ, అదితిరావ్ జాక్వెలిన్‌ను షార్ట్ లిస్ట్ చేశారు. ఫైనల్‌గా అంతా కలిసి 'జాక్వెలిన్' ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇక 'లవ్ గురు' కోసం బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్‌ను ఎన్నుకున్నారు. జాక్వెలిన్, రణ్ వీర్ సింగ్ ల ఫోటోలను 'వర్జిన్ ట్రీ'కి తగిలించి.. వాలెంటైన్స్ డే రోజు పూజలు నిర్వహించనున్నారు.
ఆనవాయితీ ప్రకారం.. ఈ ఏడాది కూడా వాలెంటైన్స్ డే నాడు 'మిస్టర్ ఫ్రెషర్' పూజారి రూపంలో ధోతి ధరించి వస్తాడని, 'వర్జిన్ ట్రీ' వద్ద దమ్‌దామి మాతకు, లవ్ గురుకు పూజలు చేసి హారతి ఇస్తాడని విద్యార్థులు తెలిపారు.