Chandrababu Naidu was lost his cool on Monday, when a farmer expressed disappointment over his governance. then Chandrababu said Don’t talk about big things. Talk about yourself. Democratically, you have told us about your concern. For that, you need not preach to us because you have a mouth.
ప్రభుత్వం తీరుపై కొంత అసహనం వ్యక్తం చేసిన ఓ రైతుపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. తుళ్లూరు మండలం వెంకటపాలెంలో నిర్వహించిన సభలో పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై సీఎం చంద్రబాబు 51వ సారి వర్చ్యువల్ రివ్యూ నిర్వహించారు. ఈ సమీక్షలో మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, కాంట్రాక్టు కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు. పోలవరం ప్రాజెక్టు పనులు 53 శాతం పూర్తయ్యాయని అధికారులు తెలిపారు
సీఎం చంద్రబాబుతో పలువురు రైతులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. ఈ సభలోనే కొందరు రైతులు ప్రభుత్వ విధానాలపై కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు. ఓ అడుగు ముందుకేసిన ఓ రైతు ప్రభుత్వంపై బాబు సమక్షంలోనే విమర్శలు గుప్పించాడు.
సుబ్బయ్య అనే రైతు తనపై దాడి చేశాడని, ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని రామాంజనేయులు అనే మరో రైతు సీఎం చంద్రబాబుకు తెలిపాడు. దీనిపై స్పందించిన సీఎం చంద్రబాబు.. ఘటనపై విచారించాలని ఎస్పీని ఆదేశించారు. అయినా సంతృప్తి చెందని రామాంజనేయులు.. అమరావతిలో రైతులకు రక్షణ లేకుండా పోయిందని విమర్శించాడు.
ఈ మాటలు చంద్రబాబు ఆగ్రహానికి గురయ్యేలా చేశాయి. పెద్ద పెద్ద మాటలు మాట్లాడొద్దంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు.. రామాంజనేయులును వారించారు. నువ్వు తెలివైన వాడివైతే.. నేను నీకంటే తెలివైన వాడిని అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలతో అక్కడి టీడీపీ నేతల్లో నవ్వులు పూశాయి.
ఆ తర్వాత ‘ఏయ్ వింటావా లేదా? నీ సమస్య చెప్పుకో.. నోరుందని పెద్ద పెద్ద ఉపన్యాసాలివ్వడం కాదు' అని చంద్రబాబు ఆ రైతును గట్టిగా మందలించారు. కాగా, నువ్వేదో చేసివుంటావు.. అందుకే కొట్టి ఉంటారని మంత్రి పుల్లారావు వ్యాఖ్యానించడంతో సభలో కొంత గందరగోళం ఏర్పడింది.