India vs South Africa 5th ODI : Spinners Eye Records

2018-02-12 35

The two teams are gearing up for the 5TH ODI in Port Elizabeth on Tuesday (February 13). Kuldeep Yadav and Yuzvendra Chahal need to wickets each to go past Lonwabo Tsotsobe and become the highest wicket-taker in a ODI series between India vs South Africa.

మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ను 2-1తో చేజార్చుకున్న కోహ్లీసేన, ఆ తర్వాత ఆరంభమైన ఆరు వన్డేల సిరిస్‌లో పుంజుకున్న తీరు నిజంగా అద్భుతం. ప్రస్తుతం ఆరు వన్డేల సిరిస్‌లో టీమిండియా 3-1 ఆధిక్యంలో ఉంది. ఇరు జట్ల మధ్య ఐదో వన్డే పోర్ట్ ఎలిజిబెత్ వేదికగా మంగళవారం జరగనుంది. ఈ వన్డేలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు మణికట్టు స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చాహల్ అరుదైన రికార్డులను సొంతం చేసుకోనున్నారు. ఈ వన్డేలో టీమిండియా విజయం సాధిస్తే సఫారీ గడ్డపై తొలిసారి వన్డే సిరిస్‌ను సొంతం చేసుకున్న కెప్టెన్‌గా కోహ్లీ చరిత్ర సృష్టిస్తాడు.
గడచిన 25 ఏళ్లలో సఫారీ గడ్డపై భారత జట్టు ఒక్క ద్వైపాక్షిక సిరిస్‌ను కూడా గెలవలేదు. అయితే, ఇప్పుడు ఈ సువర్ణావకాశం కోహ్లీసేనకు దక్కింది. ఆరు వన్డేల సిరిస్‌లో ఇంకా రెండు వన్డేలు మిగిలున్నాయి. ఈ రెండు వన్డేల్లో ఏ ఒక్క వన్డేలో అయినా భారత జట్టు విజయం సాధిస్తే సపారీ గడ్డపై కోహ్లీసేన చరిత్ర సృష్టిస్తుంది. ఇక, ఐదో వన్డేలో విరాట్ కోహ్లీ వ్యక్తిగతంగా కూడా ఓ అరుదైన మైలురాయిని సొంతం చేసుకుంటాడు.
ఐదో వన్డేలో కోహ్లీ గనుక 6 పరుగులు చేస్తే దక్షిణాఫ్రికా జట్టుపై వన్డేల్లో 1109 పరుగులు చేసిన టీమిండియా మాజీ కెప్టెన్ మహమ్మద్ అజహరుద్దీన్ రికార్డుని అధిగమిస్తాడు. అంతేకాదు నాలుగో వన్డేలో 83 బంతుల్లో 75 పరుగులు చేసిన కోహ్లీ భారత్‌ తరఫున అత్యధిక వన్డే పరుగులు సాధించిన టాప్‌-5 ఆటగాళ్ల జాబితాలో చేరాడు. ఈ జాబితాలో సచిన్‌(18,426), గంగూలీ(11,363), ద్రవిడ్‌(10,889), ధోని(9,954) వరుసగా తొలి నాలుగు స్థానాల్లో ఉన్నారు.
ఇక ఐదో వన్డేలో భారత మణికట్టు స్పిన్నర్లు చాహల్, కుల్దీప్‌లు కూడా ఓ అరుదైన రికార్డుకి చేరువలో ఉన్నారు. 2011లో భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన ద్వైపాక్షిక సిరిస్‌లో సఫారీ బౌలర్ లోన్వోబో సోత్సోబే 13 వికెట్లు తీశాడు. దీంతో భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన ఓ సిరిస్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ రికార్డు అతడి పేరు మీదే ఉంది. అయితే ప్రస్తుతం జరుగుతున్న సిరిస్‌లో కుల్దీప్, చాహల్ లు చెరో 12 వికెట్లు పడగొట్టారు. మరో రెండు వికెట్లు తీస్తే ఆ రికార్డు బద్దలవుతుంది.