Finance Minister Arun Jaitley speaks: "Andhra Pradesh's Chief Minister had written about a funding from NABARD. The funding would reduce the borrowing pace. I think a solution by which the amount will be given without an issue can be worked out. The amount will be the same.
పార్లమెంటు ఉభయ సభల్లో టీడీపీ, వైసీపీ ఎంపీల నిరసన నేపథ్యంలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ రాజ్యసభలో మంగళవారం ఓ ప్రకటన చేశారు. కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి అన్యాయం జరిగిందని ఎంపీలు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఉభయ సభలు పలుమార్లు వాయిదా పడ్డాయి. విభజన సమయంలో ఇచ్చిన ప్రత్యేక హోదా లేదా ప్యాకేజీ, రైల్వే జోన్ వంటి అంశాలపై టీడీపీ ఎంపీలు నిలదీశారు. దీంతో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ స్పందించారు. ఏపీకి అన్యాయం చేశారన్న ఎంపీల ఆరోపణల నేపథ్యంలో వారు రాజ్యసభలో ప్రకటన చేశారు.
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేమని జైట్లీ చెప్పారు. ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చామన్నారు. విభజన చట్టం అమలుకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. విదేశీ సంస్థల నుంచి ఏపీ రుణం తీసుకుంటే 90 శాతం కేంద్రం చెల్లిస్తుందని చెప్పారు.
ఏపీకి ఇవ్వాల్సిన నిధులను వివిధ మార్గాల్లో సమకూరుస్తున్నామని జైట్లీ ప్రకటించారు. ఏపీ ఆర్థిక శాఖ కార్యదర్శిని త్వరలో ఢిల్లీకి పిలిపిస్తామని చెప్పారు. రైల్వే జోన్ అంశాన్ని కూడా పరిశీలిస్తున్నామని చెప్పారు. ఇతర రాష్ట్రాలతో చర్చించాక సరైన పరిష్కారం దిశగా చర్యలు ఉంటాయని చెప్పారు.
ఈఏపీల నిధుల మంజూరుపై చర్చిస్తున్నామని జైట్లీ చెప్పారు. ఈఏపీల విషయమై జనవరి 3న ఏపీ సీఎం చంద్రబాబుకు లేఖ రాశామని చెప్పారు. ఈఏపీ నిధులను నాబార్డ్ ద్వారా ఇవ్వమని చంద్రబాబు కోరుతున్నారని, అలా ఇస్తే రాష్ట్రానికి అప్పు సామర్థ్యం తగ్గుతుందని, ద్రవ్యలోటు వ్యత్యాసం ఏర్పడుతుందన్నారు. సమస్య పరిష్కారానికి మల్లగుల్లాలు పడుతున్నట్లు చెప్పారు. ఏపీ ఆర్థిక శాఖ కార్యదర్శితో జరిగే భేటీలో రాష్ట్రానికి రావాల్సిన ప్యాకేజీ విధివిధానాలు నిర్ణయిస్తామని చెప్పారు. ఆర్థిక లోటు కింద రూ.3900 కోట్లు మంజూరు చేశామని చెప్పారు.