Amid calls for its ban resonating across several states in the country, Padmaavat released in theatres today. Vandalism and violence were reported in Haryana, Rajasthan, Gujarat, Madhya Pradesh, Uttar Pradesh and Maharashtra
దేశవ్యాప్తంగా పద్మావత్ సినిమాకు వ్యతిరేకంగా నిరసనలు తీవ్రస్థాయికి చేరాయి. ముఖ్యంగా ఆ సినిమాను బ్యాన్ చేసిన నాలుగు రాష్ట్రాలు ఆందోళనలు, హింసాత్మక చర్యలతో అట్టుడుకుతున్నాయి.బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తీసిన పద్మావత్ సినిమా ఆందోళన, నిరసనల నడుమ గురువారం దేశ వ్యాప్తంగా విడుదల కానుంది. అయితే ఈ సినిమా విడుదలకు ఒకరోజు ముందు హర్యానా, గుజరాత్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్‌లలో ఆందోళన తీవ్ర రూపం దాల్చింది. పద్మావత్ సినిమాపై నిరసనలు, ఆందోళనలు మిన్నంటుతున్నాయి. ఆందోళనకారులు రోడ్లపైకి వచ్చి హింసకు పాల్పడుతున్నారు. వాహనాలకు నిప్పు పెడుతున్నారు. షాపులను ధ్వంసం చేస్తున్నారు. దీంతో యూపీలోని ఇటావాలో ఆందోళనకారులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఈ ఘటనలో కొందరు గాయపడ్డారు. అటు ఢిల్లీ, జైపూర్ హైవేపై ఆందోళన చేయడంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ స్తంభించిపోయింది. సినిమాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కర్ణిసేన.. దేశవ్యాప్తంగా సినిమా విడుదలను అడ్డుకోవాలని మరోసారి పిలుపునిచ్చింది. హర్యానాలోని గుర్గావ్‌లో వజీర్‌పూర్-పటౌడీ రోడ్డును ఆందోళనకారులు మూసేశారు. సోహ్నాలో ఓ బస్సుకు నిప్పంటించారు. ఆదివారం వరకు థియేటర్లకు 200 మీటర్ల పరిధిలో ఎలాంటి ఆందోళనలు నిర్వహించకూడదని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. చాలా వరకు థియేటర్ల ఓనర్లు సినిమా రిలీజ్‌కు నో చెప్పారు. లక్నోలోనూ రోడ్లపైకి వచ్చి సినిమాకు వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహించారు.