తమిళనాడులో ఎడప్పాడి పళనిస్వామి ప్రభుత్వం బలపరీక్షకు సిద్దం అయితే మెజారిటీ శాసన సభ్యులు ఎంత మంది మద్దతు ఇస్తారు ? అనే ప్రశ్న మొదలైయ్యింది. ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో అన్నాడీఎంకే పార్టీ రెబల్ నాయకుడు టీటీవీ దినకరన్ విజయం సాధించిన తరువాత ఎడప్పాడి పళనిస్వామి, పన్నీర్ సెల్వం వర్గం ఎమ్మెల్యేలు బుధవారం భేటీ అయ్యారు. మనవైపు ఎంత మంది శాసన సభ్యులు ఉన్నారు అని పళనిస్వామి, పన్నీర్ సెల్వం లెక్కలు వేసుకోవడంతో 12 మంది మాయం అయ్యారని వెలుగు చూసింది.
జనవరి 8వ తేదీ నుంచి తమిళనాడు శాసన సభ సమావేశాలు జరగడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్బంలో తమిళనాడు ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసి మొదటి సారి అసెంబ్లీలో అడుగుపెడుతున్న టీటీవీ దినకరన్ ప్రతిపక్షం డీఎంకేతో కలిసి ఎడప్పాడి పళనిస్వామి ప్రభుత్వానికి మెజారిటీ శాసన సభ్యుల మద్దతు లేదని, బలపరీక్ష నిర్వహించాలని డిమాండ్ చెయ్యడానికి సిద్దం అవుతున్నారు.
శాసన సభ సమావేశాల్లో టీటీవీ దినకరన్ మన ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తే సరైన రీతిలో తిప్పికోట్టాలని ఎడప్పాడి పళనిస్వామి, పన్నీర్ సెల్వం మంత్రులు, శాసన సభ్యులకు సూచించారు దినకరన్ తిక్క మాటలకు నోరుజారి మాట్లాడి మన స్థాయిని తగ్గించుకోరాదని సీఎం పళనిస్వామి, పన్నీర్ సెల్వం సూచించారు.
బుధవారం జరిగిన అన్నాడీఎంకే శాసన సభ్యుల సమావేశానికి 104 మంది ఎమ్మెల్యేలు మాత్రమే హాజరైనారు. తమకు 116 మంది ఎమ్మెల్యేలు మద్దతు ఇస్తున్నారని ఇన్ని రోజులు ఎడప్పాడి పళనిస్వామి, పన్నీర్ సెల్వం ధీమా వ్యక్తం చేస్తూ వచ్చారు.