AP Assembly Unanimously Passed Kapu Reservation Bill. It's a strategical move by CM to divert Polavaram issue.
ఓ వివాదాన్ని సద్దుమణిగించాలంటే.. మరో వివాదాన్ని తెర పైకి తీసుకురావడం రాజకీయ చాణక్యం. ఇన్నాళ్లు నానుస్తూ వచ్చిన కాపు రిజర్వేషన్ల బిల్లును హఠాత్తుగా తెరపైకి తీసుకురావడం ఈ చాణక్యానికి నిదర్శనం. పోలవరం ప్రాజెక్టుపై హాట్ హాట్ చర్చ నడుస్తున్న సందర్భంలో ఏపీ సీఎం చంద్రబాబు కాపు రిజర్వేషన్ల బిల్లును సభలో ప్రవేశపెట్టించడం రాజకీయ ఎత్తుగడ అనే చెప్పాలి. పోలవరం ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వంపై నిందలు వినిపిస్తున్న తరుణంలో.. ఆ చర్చ లేకుండా చేసేందుకు వ్యూహాత్మకంగా బిల్లును తెర పైకి తెచ్చారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
పోలవరం విషయంలో తాను చేయాల్సినంతా చేస్తున్నా.. కేంద్రం వైఖరి వల్లే ప్రాజెక్టు ఆలస్యం అవుతోందనేలా చంద్రబాబు సంకేతాలిచ్చారు. ఒకవిధంగా తప్పంతా ప్రధాని మోడీపైనే నెట్టేసే ప్రయత్నమిది. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన తర్వాత.. రాష్ట్ర ప్రభుత్వం ఆ బాధ్యతలు తీసుకోవాల్సిన అవసరమేముంది?. తీరా ఆ బాధ్యతలు తీసుకుని ఇప్పుడు కేంద్రం మీద నిందలు మోపితే లాభమేముంది?. ప్రాజెక్టు కేంద్రమే చేపట్టి అనుకున్న సమయానికి పూర్తి చేయకపోయి ఉంటే.. చంద్రబాబు చేసే ఆరోపణలకు జనంలో విశ్వసనీయత ఉండేది.