కమల్ హాసన్ స్వీయ దర్శకత్వంలో వచ్చిన 'విశ్వరూపం' 2013లో విడుదలై సూపర్ హిట్టయింది. అప్పట్లో ఈ సినిమా విషయంలో అనేక వివాదాలు నెలకొన్నాయి. అప్పటి పరిస్థితులు సినిమా విడుదలకు అడ్డంకిగా మారడంతో కమల్ హాసన్ తీవ్ర మనస్థాపానికి గురై దేశం విడిచి వెళ్లిపోతాను అని స్టేట్మెంట్స్ ఇచ్చే వరకు వెళ్లిన సంగతి తెలిసిందే. 'విశ్వరూపం' చిత్రానికి మంచి ఆదరణ లభించడంతో ఈ చిత్రానికి సీక్వెల్ 'విశ్వరూపం 2' కూడా ప్రారంభించారు. అయితే పలు కారణాలతో షూటింగ్ మధ్యలోనే ఆగిపోయింది. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత సినిమా షూటింగ్ ప్రారంభం అయింది.
'విశ్వరూపం 2' చిత్ర షూటింగ్ నాలుగేళ్ల తర్వాత తిరిగి సోమవారం(నవంబర్ 27) ప్రారంభమైంది. ప్రస్తుతం చివరి షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది. వారం రోజుల్లో సినిమాకు సంబంధించిన టాకీ పార్ట్ పూర్తి కానుందని చిత్ర యూనిట్ వెల్లడించింది.
షూటింగ్, పోస్టు ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుని ఏప్రిల్ 28, 2018లో సినిమా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. డిసెంబర్లో ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
‘విశ్వరూపం' మొదటి భాగంతో పోలిస్తే పార్ట్ 2 మరింత ఎమోషనల్‌గా ఉండబోతోందని తెలుస్తోంది. అయితే గతంలో మాదిరిగా ఈ చిత్రంలోనూ వివాదాలు ఉంటాయా? లేదా? అనేది సినిమా విడుదలైతేగానీ చెప్పలేం.