Telugu Desam Party leader Umamahdava Reddy hot comments on own party on friday.
తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకురాలు ఉమా మాధవ రెడ్డి శుక్రవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో టీడీపీ పని అయిపోయిందనే విషయం అందరికీ తెలిసిందేనని చెప్పారు. టీడీపీ నాయకురాలే ఆ మాటలు మాట్లాడటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
అలాగే కాంగ్రెస్ పార్టీలో చేరే అంశంపై ఆమె స్పందించారు. టీడీపీ పని తెలంగాణలో అయిపోయిందని, అయితే ఎలాంటి హామీ లేకుండా తాను కాంగ్రెస్ పార్టీలో చేరడానికి పిచ్చిదానినా అని వ్యాఖ్యానించారని తెలుస్తోంది.నక్సలైట్ల చేతిలో చనిపోయిన నేతలకు ఇచ్చే ఇంటి ప్లాట్ పైన అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆమె అసెంబ్లీ లాబీల్లో మాట్లాడారు.
సీఎంను ఒంటరిగా కలిస్తే తెరాసలో చేరే విషయం ప్రచారం జరుగుతోందని, అందుకే తాను సండ్ర వెంకట వీరయ్యతో కలిసి వెళ్లానని ఉమామాధవ రెడ్డి చెప్పారు. అందరూ ఉండగానే సీఎంకు వినతిపత్రం ఇచ్చానని చెప్పారు.కాంగ్రెస్ పార్టీలో చేరిన కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి పదవులపై కాంగ్రెస్ హామీ ఇచ్చి ఉండవచ్చునని ఆమె చెప్పారు. లేదంటే తనతో మీ మాట్లాడకుంటా ఆ పార్టీలో ఎలా చేరుతారని ప్రశ్నించారు. తనకు కూడా హామీ ఇచ్చి ఉంటే రేవంత్‌తో పాటే ఢిల్లీకి వెళ్లేదాన్నని చెప్పారు.
గత ఎన్నికల సమయంలో తెరాసలో చేరమని ఆహ్వానం వచ్చిందని ఉమా మాధవ రెడ్డి చెప్పారు. ఇప్పుడు తాను పార్టీలో చేరలేదన్నారు. ప్రస్తుతం తనను ఎవరూ అడగలేదన్నారు. అడిగితే ఆలోచిస్తానని తేల్చి చెప్పారు.