Telugu Desam Party MP JC Diwakar Reddy on Tuesday talks about YSR Congress Party chief YS Jaganmohan Reddy padayatra, Jana Sena chief Pawan Kalyan and Roja.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి కారణంగా రెడ్లకు విలువ లేకుండా పోతోందని టీడీపీ పార్లమెంటు సభ్యులు జేసీ దివాకర్ రెడ్డి మండిపడ్డారు. వైయస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేపట్టినప్పుడు రోజులు వేరు, ప్రస్తుత పరిస్థితులు వేరు అని జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. నాడు టీవీ ఛానళ్లు చాలా తక్కువగా ఉండేవని, కానీ ఇవాళ భార్యాభర్తలు ఇంట్లో కాపురం చేసుకుంటున్నా వచ్చి కెమెరాలు పెట్టేస్తున్నారని చమత్కరించారు
ఎంత కాదనుకున్నా రెడ్డి కులస్తులు అందరూ జగన్ వెంట వెళ్తున్నారని జేసీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దాంతో రెడ్లను ఇతర కులాలకు చెందినవారు గౌరవించడం మానేశారని, రెడ్ల తోకలను కరణం బలరాం లాంటి వాళ్లు కోసేశారని వ్యాఖ్యానించారు.ఇక తనకు రాజకీయాలు అనవసరమని జేసీ దివాకర్ రెడ్డి స్పష్టం చేశారు. 2019లో రిటైర్ అవుతానని వెల్లడించారు. జగన్ పాదయాత్ర వృథా ప్రయాస అన్నారు. ఆయన పాదయాత్ర వల్ల వచ్చేది ఏమీ లేదన్నారు..వైయస్ రాజశేఖర రెడ్డి పేరు చెప్పుకునే రోజులు పోయాయని, ఇక అరిగిపోయిన ఆ రికార్డు చెప్పడం మానుకోవాలని జగన్‌కు హితవు పలికారు.
జగన్‌కు పొద్దున లేచినప్పటి నుంచి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును విమర్శించడమే పని అని జేసీ విమర్శించారు. ఒక పార్టీకి నాయకుడిగా ఓట్లు సంపాదించుకోవడంలో తప్పు లేదని, కానీ పదేపదే అర్థం లేని విమర్శలు సరికాదన్నారు.